జాతి జాగృతి దినోత్సవం_ఆగష్టు 6_ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జన్మ దినం

0 Comments

ఈ నాడు పొడిచిన పొద్దు తెలంగాణా- ఈ పోరాట అధ్యాయం లో ఆద్యంతాలు వినిపించే ఏకైక పేరు- కొత్తపల్లి జయశంకర్.. ప్రొఫెసర్ సాబ్... మన సారు...
1952 ముల్కి ఉద్యమంలో స్కూల్ విద్యార్థి గా క్లాసు నుండి వాకౌట్ చేయడం , 1969 తెలంగాణా ఉద్యమంలో కాలేజీ విద్యార్థి గా పోరాటం , తర్వాత తెలంగాణా జన సభ ని స్థాపించడం,  తెలంగాణా ఐడియాలజీ ని సభలు, సెమినార్ లు పెట్టి విశ్వవ్యాప్తం చేసి తెలంగాణా శక్తులన్నిటినీ సంఘటితం చేయడం, మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన తెరాస పార్టీ స్థాపనకు పథ నిర్దేశం,  డిసెంబర్ 9,2009 చిదంబరం చదివిన ప్రకటన ఫ్రేమ్ చేయడం ఇలాతన జీవితపు చివరి రోజు వరకు ఆశించింది, శ్వాసించింది కేవలం తెలంగాణానే.
అరవై ఏళ్ళుగా తెలంగాణా ఉద్యమం ముందుకెళ్ళి నట్లే తను కూడా అంతే కాలం పాటు తన భావజాల వ్యాప్తి కృషి చేసి సకల జనులను ఉద్యమం లో భాగం చేయగలిగినారు. ఆరు దశాబ్దాలుగా మనం కోల్పోయిన నిధులను, నీళ్ళను, ఉద్యోగాలను, మెజారిటీ ఆధిపత్యం లో అణచబడిన సంస్కృతి ని, వెక్కిరించబడిన బాషని ఎప్పటి కప్పుడు మన కళ్ళకు కడుతూ , ఎదుటోడికి ఎత్తిచూపుతూ తెలంగాణా జాతి  ని జాగృతపరిచిన సారును ‘జాతి పిత’ అనక మరేమీటంటాం.
సారూ! మీరు తెలంగాణ సిద్ధాంతకర్త గదా అంటే లేదు లేదు నేను నేను కేవలం కార్యకర్త అన్న అయన వినమ్రత కి మొక్కకుండా ఉండగలమా! జాతి కోసం జీవితం ఇచ్చిన జయశంకర్ సారు ని భవిష్యత్తు తరాలకు అందించడంలో కృషి చేయవలసింది ఈ తరమే!
తెలంగాణా పునర్నిర్మాణం పై అత్యంత చిత్తశుద్ది తో ఉన్న మన ప్రభుత్వం ఇప్పటికే సారు పేరు మీదుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కి సార్ పేరు పెట్టారు అంతే కాక ఒక జిల్లా పేరు పెడతామని, వరంగల్లు ఏకశిలా పార్క్ పేరు  మారుస్తామని, రిసెర్చ్ సెంటర్ ని కూడా పెడతామని ప్రకటించింది.  కానీ సార్ ని కేవలం ఒక జిల్లా కో పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలు ప్రతి నిత్యం స్మరించుకునేలా ఒక దినోత్సవాన్ని ప్రకటించడం ఎంతైనా అవసరమున్నదని గ్రహించి ఈ కామ్పెయిను కి తెర తీయడం జరిగింది.

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ని ‘తెలంగాణా జాతి పిత’ గా గుర్తిస్తూ నిర్ణయం తీస్కోవాలని, సార్ పేరు మీద ఒక పాఠ్యాంశం ప్రవేశపెట్టాలని,  జాతిని జాగృతం చేసి ముందుండి పథ నిర్దేశం చేసిన సార్ జన్మ దినాన్ని (ఆగష్టు 6 ) “జాతి జాగృతి దినోత్సవం” గా ప్రకటించాలని ‘జాతి నిర్మాత’ కెసిఆర్ గారిని కోరుతున్నాం.

సార్! మీకు ఏమిచ్చిన తక్కువే.. మీ గురించి ఎంత చెప్పిన అది ఎల్ల కాలం ‘ఒడవని ముచ్చట’ నే! మనందరికి ఏదో ఒక శక్తి ఉండి ఉంటే “ జయ జయ శంకర దిగిరారా.. పొడిచిన పొద్దుని కనవేరా” అని వేడుకునైనా మిమ్మల్నిదివి నుండి భువి కి తెచ్చుకునేవాళ్ళం! జయ శంకరా!!
 సదా నీ స్మృతిలో ఈ తెలంగాణా జాతి... జై తెలంగాణా!

                                                                                                                                                      యెన్నెన్జీ
                                                                     (నరేందర్ గౌడ్ నాగులూరి)

                                                                          “యాది” లఘు చిత్ర దర్శకుడు 

                                                  "Yaadi"- Telangana short film  -  


You may also like